TS Sarpanch Elections : పంచాయతీ ఎన్నికలు లేనట్టే 6 నెలలు పొడిగింపు ?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో (Telangana Sarpanch Elections) ఇప్పట్లో జరిగేలా లేవు. ఫిబ్రవరి 1 కే ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తోంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో (Telangana Sarpanch Elections) ఇప్పట్లో జరిగేలా లేవు. ఫిబ్రవరి 1 కే ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ (State Election Commission).. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరో 18 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. అందువల్ల ఇక ప్రత్యేక అధికారుల పాలన మొదలు కాబోతోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంకా దీనిపై స్పందించలేదు. అంతేకాదు.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తో జరగాలి. అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇంకా బీసీ నివేదికను సమర్పించలేదు. దాంతో ఆ అంశం కూడా పెండింగ్ లో ఉంది.
పంచాయతీ ఎన్నికలు మరో 6 నెలలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెలలో రాబోతుంది. 2019లో పరిస్థితిని చూసుకుంటే.. మే కల్లా సార్వత్రిక ఎన్నికలు పూర్తవుతాయి. అంటే పంచాయతీ ఎన్నికలను అప్పటిదాకా నిర్వహించే అవకాశం లేదు. వచ్చే మేతో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగుస్తోంది. అందుకే మే నెల తర్వాతే.. పంచాయతీలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందని భావిస్తున్నారు.
సర్పంచ్ లు మాత్రం తమ గడువు కాలం మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు 2019లో పంచాయతీల బాధ్యతలు చేపట్టారు. కానీ కరోనా కారణంగా రెండేళ్ళు సరిగా పాలన చేయలేకపోయామనీ.. ఇప్పుడు ప్రత్యేకాధికారులకు అప్పగిస్తే పంచాయతీల్లో అభివృద్ధి ఆగిపోతుందని అంటున్నారు. ఒకవేళ సర్పంచుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే.. పంచాయతీలకు సర్పంచులు పర్సన్ ఇన్ ఛార్జులుగా మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే సీట్లు గెలిచే ఛాన్సుంది. అప్పుడు పంచాయతీ, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించే అవకాశముంది. జనరల్ గా రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే.. పంచాయతీల్లోనూ అదే పార్టీ హవా నడుస్తుంది. పైగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నాయి. అప్పుడు పంచాయతీలు, స్థానిక సంస్థల్లోనూ మెజారిటీ స్థానాలు హస్తం పార్టీకి దక్కుతాయని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. అందువల్ల లోక్ సభ ఎన్నికల తర్వాతే రేవంత్ రెడ్డి సర్కార్ పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టే ఛాన్సుందని చెబుతున్నారు.