GULABI RAKULU BRS : రాలిపోతున్న గులాబీ రేకులు.. బీజేపీ, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు

గులాబీ రేకులు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం దూరం కాగానే నేతల అసలు స్వరూపం బయటపడుతోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) ఆపరేషన్ ఆకర్ష్‌కు గులాబీ రేకులు రాలిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు BRS ను వదిలి పారిపోదామా అని లీడర్స్ రకరకాల దారులు వెతుక్కుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2024 | 12:13 PMLast Updated on: Feb 08, 2024 | 12:13 PM

Falling Rose Petals Brs Leaders Join Bjp And Congress

గులాబీ రేకులు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం దూరం కాగానే నేతల అసలు స్వరూపం బయటపడుతోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) ఆపరేషన్ ఆకర్ష్‌కు గులాబీ రేకులు రాలిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు BRS ను వదిలి పారిపోదామా అని లీడర్స్ రకరకాల దారులు వెతుక్కుంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముంగిట్లో తెలంగాణ కాంగ్రెస్… గేట్లెత్తిందా? ఆపరేషన్ ఆకర్ష్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందా? అంటే.. అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన పాత నాయకులను తిరిగి రప్పించడంపై అధినాయకత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) ముందు.. రాజకీయ ప్రత్యర్థులపై పంజా గట్టిగానే విసరాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. దాని చుట్టూనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ టూర్‌లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కండువా కప్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. అదే సమయంలో మన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్‌ కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని .. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టుగానే చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ సీట్లు గెలవాలన్న కసిగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌.

సీఎంగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎదుర్కోబోతున్న మొదటి ఎన్నిక కావడంతో ఆయనకు కూడా ఇది సవాల్‌గా మారిందట. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే… వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడమన్నది మరో ఎత్తుగా భావిస్తున్నాయి రాజకీయవర్గాలు. సీఎంకి ఇది మేజర్‌ టాస్క్‌ కావడంతో… చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి తాజా పరిణామాలు. వెంకటేష్ నేతతో పాటు… బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కూడా కాంగ్రెస్‌కు క్యూలో ఉన్నారనే టాక్ మొదలైంది. అలాగే మాజీ మంత్రి రాజయ్య కూడా గులాబీ కండువా తీసి పక్కన పెట్టేశారు.

ఆయన మూడు రంగుల కండువా కప్పుకోవడం ఎప్పుడన్నది మాత్రమే తేలాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. మరో సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మీద కూడా రూమర్స్‌ నడుస్తున్నాయి. రంజిత్ రెడ్డి కారు దిగేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఎంపీతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నేత కూడా కాంగ్రెస్‌ గూటికి చేరతారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. మొత్తంగా ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే… బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరి కొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి గులాబీ రేకులు ఎన్ని రాలిపోతాయో, అలా రాలకుండా పార్టీ అధిష్టానం ఏం ట్రీట్‌మెంట్‌ ఇస్తుందో చూడాలి.