MLC ELECTIONS: కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు హైకోర్టు షాక్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారంపై స్టే
కాంగ్రెస్ అభ్యర్థులు కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరి ఎన్నికపై స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది.
MLC ELECTIONS: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులు కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరి ఎన్నికపై స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ, వీరి ఎన్నికను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. దీంతో ఇప్పుడు గవర్నర్ కోటాలో అభ్యర్థుల్ని భర్తీ చేసే అవకాశం అధికార కాంగ్రెస్‌కు దక్కింది. ఈ లెక్కన కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వీరి నియామకం విషయంలో కొంతకాలం వేచి చూసిన గవర్నర్ తమిళిసై.. అనంతరం ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ, వీరి ఎన్నికను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎన్నికను నిలిపివేయాలని కోరారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు వారి ఎన్నిక నిర్వహించకూడదని కోరారు. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించడం ఆపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన హైకోర్టు.. తాజా ఎమ్మెల్సీల నియామకంపై స్టే విధించింది.
వచ్చే నెల 8 వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించకుండా, యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రమాణస్వీకారం చేయించవద్దని కోర్టు సూచించింది. దీంతో గవర్నర్ ఆమోదించినప్పటికీ.. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు షాక్ తగిలినట్లైంది. కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడే వరకు ఇధ్దరూ.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడం కుదరదు. మరోవైపు తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఆశిస్తున్నారు.