SIVA BALAKRISHNA : హైదరాబాద్ ను మింగేశాడు.. వెయ్యి కోట్లు ఏసేశాడు !
HMDA మాజీ డైరెక్టర్ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna) అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే... ACB అధికారులు కళ్లు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి. తెలంగాణలోనే (Telangana) కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి.
HMDA మాజీ డైరెక్టర్ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna) అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే… ACB అధికారులు కళ్లు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి. తెలంగాణలోనే (Telangana) కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అక్రమాస్తుల చిట్టా చాంతాడంత ఉంది. ఇంత వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే.
HMDA డైరెక్టర్ పదవిని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టాడు శివబాలకృష్ణ. ఎనిమిది రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు ACB అధికారులు. బినామీలు, అతనికి సహకరించిన అధికారుల వివరాలను రాబట్టారు. శివబాలకృష్ణ బినామీల పేరు మీద 214 ఎకరాలు భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. 7 ఫ్లాట్లు, 3 విల్లాలు, 19 ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూల్‌లో జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు.
తెలంగాణలోనే కాదు AP లోనూ శివబాలకృష్ణకు భారీగా ఆస్తులున్నాయి. విశాఖపట్నంలో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 29 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, విజయనగరంలో కూడా ఆస్తులున్నట్టు దర్యాప్తులో తేలింది. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు అధికారులు. ఆయన బ్యాంకు లాకర్లలో బంగారంతో పాటు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను సీజ్ చేసింది ఏసీబీ. అవినీతి వ్యవహారాల్లో కొందరు HMDA అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తులో చెప్పాడు శివబాలకృష్ణ. దీంతో వాళ్లపైనా ఎంక్వైరీ చేస్తున్నారు. వివిధ ప్రాపర్టీలకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
రియల్ ఎస్టేట్ (Real Estate) రెగ్యులేటరీ అథారిటీ- రెరాలో శివబాలకృష్ణ పనిచేసినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులిచ్చినట్టు గుర్తించారు. దీంతో ఆ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తోంది ACB. హైదరాబాద్‌లోని నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్‌మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు… బ్లాక్ లిస్ట్‌లో ఉన్న 2 రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు కూడా క్లియర్ చేశారు. దీనికి ప్రతిగా కొందరు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు శివబాలకృష్ణ. అలాగే, ఆయన బినామీలకు కూడా ఫ్లాట్స్ ఇచ్చినట్టు దర్యాప్తులో గుర్తించారు ACB అధికారులు.
ఈ అవినీతిలో సోదరుడు శివ నవీన్ పాత్ర కూడా ఉందని తేలింది. అక్రమంగా సంపాదించిన 48 భూముల డాక్యుమెంట్స్‌లో 21 ఆస్తులు నవీన్, అతని భార్య అరుణ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతో నవీన్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత అతన్ని జైలుకు పంపారు అధికారులు. శివబాలకృష్ణతో పాటు శివనవీన్‌ను మరోసారి తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తామంటున్నారు.
శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. త్వరలో మరో ముగ్గురిని అరెస్ట్ చేస్తామంటున్నారు ACB అధికారులు. ప్రస్తుతం శివబాలకృష్ణ 8 రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని నాంపల్లిలోని ACB కోర్టులో హాజరుపర్చారు. అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో శివబాలకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించారు.