Insurance to Gig Workers, Drivers: ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా
గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు AICC అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా వారికి రూ.5లక్షల ప్రమాద బీమాను కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్కీమ్ వర్కింగ్ జర్నలిస్టులు, ట్రాన్స్ పోర్ట్, నాన్ ట్రాన్స్ పోర్ట్, ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు కూడా వర్తిస్తుంది.
Insurance to Gig Workers, Drivers: గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు ట్రాన్స్ పోర్ట్, నాన్ ట్రాన్స్ పోర్ట్, ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు కూడా ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ వర్కర్లు ఎవరైనా ప్రమాదవశత్తూ చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. కార్మికుల ప్రమాద బీమాకు రవాణాశాఖ కమిషనర్ మాస్టర్ పాలసీ హోల్డర్ గా, సహాయ మోటార్ వాహన ఇన్స్ పెక్టర్ రిజిస్ట్రీ అథారిటీగా వ్యవహరిస్తారు. కార్మికులకు ప్రమాద బీమా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్ ను ప్రభుత్వం ఆదేశించింది.
స్విగ్గీ బాయ్ కుటుంబానికి రూ.2లక్షల సాయం
4 నెలల క్రితం డ్యూటీలో ఉంది ప్రమాదవశాత్తు చనిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. మాట ఇచ్చినట్టుగా వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను సెక్రటరియేట్ లో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశాననీ… కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కుటుంబ వివరాలు తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.