తెలంగాణా టూర్ కు పవన్ రెడీ, వారాహి బయటకు…

జనసేన తెలంగాణాలో రంగంలోకి దిగబోతుంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండాలు మాత్రమే కనపడిన తెలంగాణాలో ఇక నుంచి జనసేన నాయకులు, జనసేన బహిరంగ సభలు, జనసేన వాహనాలు కనపడనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 11:10 PMLast Updated on: Aug 31, 2024 | 9:58 AM

Pawan Kalyan Telangana Tour

జనసేన తెలంగాణాలో రంగంలోకి దిగబోతుంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండాలు మాత్రమే కనపడిన తెలంగాణాలో ఇక నుంచి జనసేన నాయకులు, జనసేన బహిరంగ సభలు, జనసేన వాహనాలు కనపడనున్నాయి. పవన్ అభిమానులు మాత్రమే ఉన్న తెలంగాణాలో ఇక నుంచి జనసేన కార్యకర్తలు కూడా ఉండనున్నారు. త్వరలోనే జనసేన పార్టీ జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు కూడా ప్రారంభం కానున్నాయి. అవును ఇప్పటి వరకు తెలంగాణా విషయంలో సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ అధినేత ఇక తెలంగాణా గడ్డపై కూడా తన ప్రతాపం చూపించేందుకు సిద్దం కాబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ… వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో సైతం అధికారంలో భాగం కావాలని పట్టుదలగా ఉంది. ఏపీలో ఇప్పుడు జనసేన పార్టీని బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో కష్టపడుతున్న పవన్… హైదరాబాద్ లో కూడా జనసేన పార్టీ బలోపేతం కోసం రంగం సిద్దం చేసుకున్నట్టే కనపడుతోంది. వచ్చే నెల లేదా అక్టోబర్ నుంచి తెలంగాణాలో పర్యటనలకు పవన్ కళ్యాణ్ సిద్దం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వారాహి వాహనంతోనే ఆయన తెలంగాణాలో పర్యటిస్తారు.

ముందుగా ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ జిల్లాల మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టి… అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్ళే యోచనలో ఉన్న పవన్… కొందరు బీఆర్ఎస్ నేతలకు స్వాగతం పలకాలని భావిస్తున్నారు. ఏకంగా ఒక ఎమ్మెల్యే గారికి తెలంగాణా జనసేన అధ్యక్ష బాధ్యతలను ఇచ్చే ప్లాన్ చేసారట. కాని విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో ఆయన వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

తన మేనల్లుడు సాయి ధరం తేజ్ కు ఇప్పుడు తెలంగాణా అధ్యక్ష బాధ్యతలను ఇచ్చి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాలని పవన్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు జనసేన వైపు చూస్తున్నారనే టాక్ కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ తో వారికి మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. అందుకోసం ఇప్పుడు జనసేన తీర్ధం పుచ్చుకునే పయత్నం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. సినిమాల కోసం పవన్ నెలలో 15 రోజులు రెండు నెలల పాటు హైదరాబాద్ లో ఉంటారు. అందులో మూడు రోజులు పార్టీ బలోపేతం కోసం కేటాయించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో జనసేన పార్టీ తెలంగాణా కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.