రేవంత్‌కు తలనొప్పిగా మారిన తమ్ముళ్ల ఓవరాక్షన్
తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం. గత ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను ఫర్‌ఫెక్ట్‌గా వాడుకుని ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుల వ్యవహారం.. ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. మాధాపూర్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు రోడ్లు కూడా కనబడని స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న ప్రదేశాలతో పాటు అనుమతి లేని ప్రదేశాల్లో కూడా భారీ కటౌట్‌లు కట్టారు. సామాన్యులకు ఇబ్బందిగా ఉన్నా పోలీసులు ఈ కటౌట్‌లను తొలగించేందుకు సాహసం చేయలేదు. ఇక ఈ పార్టీకివచ్చింది కూడా కామన్ పీపుల్ కాదు. అంతా హై ప్రొఫైల్స్. డీజీ స్థాయి ఉన్న అధికారులు కూడా తిరుపతిరెడ్డి ఇంటికి వెళ్లి విష్ చేసి వచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు కూడా తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లారు. వాళ్ల కార్లతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. కేవలం సీఎం తమ్ముడు అనే ఒకే ఒక్క కారణంతో ఇంత అసౌకర్యం కలిగించిన తిరుపతిరెడ్డి అనుచరులపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఈ ఫ్లెక్సీ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడికి ఎంవోయూ కుదుర్చుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడికి చెందిన కంపెనీ నుంచి ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో దందాలు సెటిల్‌మెంట్‌లు పెద్ద స్థాయిలో రేవంత్ తమ్ముళ్ల ఆద్వర్యంలో జరుగుతున్నాయనే అరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దాదాపు 18 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఎప్పుడు వాళ్ల తమ్ముళ్లు తెర వెనక పని చేయడం తప్ప స్క్రీన్ మీదకు ఫ్లెక్సీల మీదకు వచ్చింది లేదు. రాజకీయంగా పెద్దగా పదవులు కూడా ఆశించింది లేదు. కానీ ఇప్పుడు.. రేవంత్ సీఎం ఐన తరువాత.. వరుసగా వాళ్ల సోదరుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు విశ్లేషకులు. ఏ కుటుంబ పాలన అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారో అప్పుడు అదే మచ్చ రేవంత్‌పై పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీన్ని మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్తున్నారు.