కాంగ్రెస్ సోషల్ మీడియా ఫెయిల్, రేవంత్ సంచలన నిర్ణయం…?
తెలంగాణా కాంగ్రెస్ సోషల్ మీడియా దారుణంగా ఫెయిల్ అవుతుందా…? అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందు తేలిపోతుందా…? అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సక్సెస్ అవ్వడానికి సోషల్ మీడియానే కారణమా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్ పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా బలపడింది. కాంగ్రెస్ నేతలను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు.
కాని కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ కాలేకపోతోంది. కనీసం నాయకుల అధికారిక ఖాతాల్లో కూడా బీఆర్ఎస్ కు దీటుగా పోస్ట్ లు కనపడటం లేదు. దానికి ఉదాహరణే సబితా ఇంద్రా రెడ్డి వ్యవహారం. రేవంత్ రెడ్డి ఆమెను ఏదో అన్నారని గులాబీ పార్టీ నానా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. కాని రేవంత్ ఆమెను చేసిన వ్యాఖ్యల్లో గులాబీ పార్టీ చేసినంత హడావుడి లేదు అనేది కొందరి మాట. కాని దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రయత్నాలను బీఆర్ఎస్ చేసి రేవంత్ ను టార్గెట్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.
కాని కాంగ్రెస్ మాత్రం కనీసం ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని కూడా ప్రచారం చేయలేకపోయింది, ఆ వీడియో లను కూడా వైరల్ చేయలేకపోయింది. దీనిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా పని తీరు చూసిన సిఎం రేవంత్ రెడ్డి… కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే ఉంటే మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆయన… తెలంగాణా ఎన్నికలకు పని చేసిన సునీల్ కనుగోలు టీంకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే పేరుతో సునీల్ టీం బాగా పని చేసింది.
అందుకే ఇప్పుడు మళ్ళీ వారికే బాధ్యతలు అప్పగిస్తే… బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి బాగుంటుంది అనే భావనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందట. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ కు సోషల్ మీడియా కీలకం. ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేసే చాలా మంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సందడి చేసే బ్యాచ్. వీళ్ళతో పోలిస్తే… తెలంగాణాలో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు అన్ని వైపుల నుంచి గులాబీ పార్టీని టార్గెట్ చేసారు.
అప్పటి ఆంధ్రా ప్రతిపక్ష నేత చంద్రబాబు ని అరెస్ట్ చేసిన తర్వాత అప్పటి మంత్రి కేటిఆర్ చేసిన ట్వీట్ ను బాగా వైరల్ చేయడంతో తెలంగాణాలో ఉన్న చంద్రబాబు అభిమానులకు కూడా మండింది. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత చేస్తున్న నిరసనలను కూడా కేటిఆర్ తప్పుపట్టడం కూడా గులాబీ పార్టీకి మైనస్ అయ్యే విధంగా టీడీపీ, రేవంత్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో పని చేసారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అదే కారణం అనే టాక్ కూడా ఉంది.
అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హస్తం అంతగా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంత ఎదురు దాడి చేస్తున్నా సరే వాళ్ళు పోరాటం చేయలేకపోతున్నారు. అందుకే రేవంత్… సునీల్ టీం ని నమ్ముకున్నారని టాక్ నడుస్తోంది. నాయకుల అధికారిక ఖాతాలు అన్నీ కూడా సునీల్ టీం చూసే విధంగా కాంగ్రెస్ ఒప్పందం చేసుకునే సూచనలు కనపడుతున్నాయి. నాయకులు సైతం సరైన కంటెంట్ తో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.