Telangana BJP : ఆ స్థానాలపైనే బీజేపీ ఫోకస్‌.. ప్లాన్‌ రెడీ.. ఈటల పోటీ ఎక్కడి నుంచి అంటే…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి.. ఆ సౌండ్‌ ఢిల్లీ వరకు రీసౌండ్ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తోంది తెలంగాణ బీజేపీ. 400 ప్లస్‌ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. తెలంగాణ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను తెలంగాణలో గెలుచుకునేలా.. ఢిల్లీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 04:07 PMLast Updated on: Feb 14, 2024 | 4:07 PM

Telangana Bjp

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి.. ఆ సౌండ్‌ ఢిల్లీ వరకు రీసౌండ్ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తోంది తెలంగాణ బీజేపీ. 400 ప్లస్‌ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. తెలంగాణ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను తెలంగాణలో గెలుచుకునేలా.. ఢిల్లీ పెద్దలు వ్యూహరచ్న చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలను బీజేపీ గెలిచింది. ఐతే ఇప్పుడు ఈ నాలుగు స్థానాలతో పాటు.. మరో ఐదారు స్థానాలను గెలిచి తీరాలనే పట్టుదలతో కనిపిస్తోంది కాషాయం పార్టీ. ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్ స్థానాల మీద ఫోకస్ పెట్టింది. ఆ నాలుగు స్థానాలతో పాటు ఈ ఐదు స్థానాలను గెలుచుకోవాలని పక్కాగా స్ట్రాటజీ సిద్ధం చేస్తోంది. ఈ ఐదు స్థానాల్లో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో.. బీజేపీ సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CM Revanth Fire on KCR : నీ అంగీ ఊడబీకి పంపుతాం… ఏం పీకనీకి పోయినవ్ అంటవా ?:అసెంబ్లీలో రేవంత్ ఫైర్

ముఖ్యంగా మాదిగ, ఆదివాసీ సామాజికవర్గం వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తమ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ స్థానాల్లో అభ్యర్థి ఎంపిక నుంచి.. ప్రచారం తీరు వరకు.. ప్రతీ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది బీజేపీ. ఇక అటు బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బీజేపీలో సరైన అభ్యర్థులు లేకపోతే.. ఇతర పార్టీల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వాలని.. ఏదో రకంగా పది స్థానాలను తెలంగాణలో గెలుచుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు టాక్. ఈటల రాజేందర్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నా.. మెదక్ లేదా జహీరాబాద్ నుంచి బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం ఈటలకు సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బలమైన అభ్యర్థులు లేని చోట చేరికలను ప్రోత్సాహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక అటు ఢిల్లీ పెద్దలు త్వరలోనే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.