Telangana Congress MLC : కాంగ్రెస్ ఎమ్మెల్సీ దక్కేదెవరికి ?
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరొకటి వచ్చే ఛాన్సుంది. మరి కాంగ్రెస్ నుంచి ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం హస్తం పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలవబోతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా గెలిచిన ఇద్దరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. జనవరి మూడో వారంలో జరిగే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లలో అధికార పార్టీ ఒకటి, ప్రతిపక్ష పార్టీ ఒకటి గెలుచుకునే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీ సాదాసీదాగానే ఎన్నికలు జరగాలనుకుంటోందా..? లేదంటే మరేదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. అదే క్రమంలో అభ్యర్థి ఎవరన్న చర్చ కూడా మొదలైంది.
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఒక సీటు గెలుచుకోవడానికి 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఈలెక్కన రెండు సీట్లు గెలుచుకునే బలం ప్రస్తుతానికి కాంగ్రెస్ కి లేదు. అయితే రాజకీయ ఎత్తుగడలు ఎవరివి ఎలా ఉన్నాయనేది ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణలో ప్రస్తుతానికి మైనార్టీ కోటాలో ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఎవరూ లేరు. అందుకే ఖాళీ అయిన స్థానాన్ని ఆ కోటాలో భర్తీ చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ తోపాటు విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది
అలాగే… శాసనసభ ఎన్నికల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు టికెట్లను త్యాగం చేశారు. పార్టీ కూడా టికెట్లు రాని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అప్పట్లో బుజ్జగించింది. దీంతో పార్టీ అధికారంలోకి రాగానే…చాలామంది నేతలు ఎమ్మెల్సీ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి.. జగ్గారెడ్డి, మహేష్ గౌడ్ లాంటి నేతల పేర్లు కూడా ఎమ్మెల్సీ సీటు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కాబట్టి ఆ ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీకి ఈజీ. అలాంటి సీటును ఎవరికి కేటాయిస్తారన్న చర్చ పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల తేదీ ఖరారైనందున అధికార పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు అందర్నీ సంప్రదించిన తర్వాత పేరుని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి అధిష్టానం ఆమోదముద్ర కూడా వేయాలి. అధికార కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఎవరిని వరిస్తుంది..? పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది. ? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ లక్కీ లీడర్ ఎవరో చూడాలి మరి.