KAVITHA NO BAIL : కవితకు అందుకే బెయిల్ రాలేదు.. చక్రం తిప్పిన భానుప్రియ మీనా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న కవితకు బెయిల్ రిజెక్ట్ అయింది. తన కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత.

That's why Kavitha didn't get bail.. Bhanupriya Meena who turned the wheel
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న కవితకు బెయిల్ రిజెక్ట్ అయింది. తన కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ED జేడీ భానుప్రియ మీనా చూపించిన ఎవిడెన్సులే బెయిల్ రిజెక్ట్ కు కారణమైనట్టు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన MLC కవిత (MLA, Kavitha) ఈనెల 26 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయనీ… మధ్యంతర బెయిల్ (Interim Bail) ఇప్పించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆమె తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ ఈ మధ్యంతర బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదించింది. కవిత కొడుక్కి ఇప్పటికే సగం ఎగ్జామ్స్ పూర్తయ్యాయనీ… ఇప్పుడు బెయిల్ అవసరం లేదన్నారు ఈడీ తరపున న్యాయవాది. అంతేకాకుండా… ED జేడీ భానుప్రియ మీనా స్వయంగా రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాను కలుసుకొని కొన్ని ఎవిడెన్సులు చూపించినట్టు సమాచారం.
గతంలో ఈడీ ప్రశ్నించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత తమకు ఇచ్చారనీ… కానీ అవన్నీ ఫార్మాట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత కూడా నాలుగు ఫోన్లను కవిత ఫార్మాట్ చేసినట్టు ఎవిడెన్సులు చూపించారు జేడీ భానుప్రియ మీనా. అప్రూవర్‌ను కవిత బెదిరించారంటూ కీలక ఆధారాలు సమర్పించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను బయటకు చూపించలేమంటూ… జడ్జి ముందుకు తీసుకెళ్ళి వాటిని చూపించారు. కొడుక్కి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు. కానీ ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని కూడా భానుప్రియ మీనా కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఎవిడెన్సులు చూపించడంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఆమె జ్యూడిషియల్ రిమాండ్ కూడా మంగళవారంతో ముగుస్తోంది.
కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని మళ్ళీ న్యాయస్థానాన్ని అశ్రయించనున్నారు ఎమ్మెల్సీ కవిత. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె తరపు న్యాయవాది అప్లికేషన్ దాఖలు చేయనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ పై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్ట్ చెప్పింది. వీలైనంత తొందరగా ఆ బెయిల్ పిటిషన్ ను విచారించాలని కోర్టును కోరనున్నారు కవిత తరపు న్యాయవాది.