IAS SCAMS : తెలంగాణను దోచేసిన.. అవినీతి ఐఏఎస్ లు
తెలంగాణ (Telangana) లో ఒక్కో అవినీతి IAS అధికారి బండారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. BRS ప్రభుత్వ హయాంలో వందలు, వేల కోట్లు దండుకున్న కొందరు IAS ల అవినీతిని బయటకు లాగుతోంది ఏసీబీ. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఒక్కడిని పట్టుకుంటే... మరో ముగ్గురు IASల ప్రమేయం బయటపడింది.
తెలంగాణ (Telangana) లో ఒక్కో అవినీతి IAS అధికారి బండారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. BRS ప్రభుత్వ హయాంలో వందలు, వేల కోట్లు దండుకున్న కొందరు IAS ల అవినీతిని బయటకు లాగుతోంది ఏసీబీ. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఒక్కడిని పట్టుకుంటే… మరో ముగ్గురు IASల ప్రమేయం బయటపడింది. వీళ్ళంతా కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) కోటరీలో పనిచేసేవాళ్ళే. కేటీఆర్ కు దగ్గరగా ఉన్నవాళ్ళే. అవినీతి IAS లను పక్కన పెట్టుకొని ఇన్నాళ్ళు పాలన ఎలా చేశారు. అసలు వీళ్ళ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు అన్నది తేలాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి నేతలు తెలంగాణను దోచుకున్నారనీ… తమ రాష్ట్రం తమకు వస్తే… నిధులు, నీళ్ళు, నియామకాలు తమకే దక్కుతాయని తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న టీఆర్ఎస్ (TRS) అలియాస్ బీఆర్ఎస్ కి పదేళ్ళు అధికారం అప్పగించారు. కానీ ఈ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. గుది బండగా మారిన కాళేశ్వరం, అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్ ఒప్పందాలు… ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ సమర్థించుకుంటూ వస్తున్నారు గులాబీ పెద్దలు. కానీ ఇప్పుడు తమ కోటరీలో పనిచేసిన IAS అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల తెలంగాణ సొమ్మును అడ్డంగా దోచుకున్నట్టు ఏసీబీ ఆధారాలతో సహా బయటపెడుతోంది.
తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అధికారులను దోచుకొని పెద్దవాళ్ళు అవ్వడానికా… లేదంటే వాళ్ళను బినామీలుగా ఉంచి పాలకులు బాగుపడటగానికా అని తెలంగాణ జనం ప్రశ్నిస్తున్నారు. అవినీతి అనకొండ శివబాలకృష్ణను ఏసీబీ (ACB) అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే… ఆయన అవినీతి హద్దులు దాటినట్టే తేలింది. వందల ఎకరాల భూములు, విల్లాలు, ప్లాట్స్ కొనడమే కాదు… రియల్టర్ల దగ్గర కోట్ల రూపాయలను లంచంగా తీసుకొని పైఅధికారులకు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా ముట్టజెప్పినట్టు కన్ఫేషన్ స్టేట్ మెంట్ లో క్లియర్ గా ఒప్పుకున్నాడు. సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ ఎంత చెబితే అంత… ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేయించి ఇచ్చాడు శివబాలకృష్ణ. ఒక రియల్ ఎస్టేట్ అధికారి దగ్గర 10 కోట్లు, మరొకరి దగ్గర కోటి… ఇలా వసూలు చేశారు. అరవింద్ కుమార్ కి లంచంగా విల్లాలు కూడా ఇచ్చినట్టు తేలింది.
ఇదే కన్ఫేషన్ స్టేట్ మంట్ లో మరో సీనియర్ IAS అధికారి రజత్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. ఆయనకు మహబూబ్ నగర్ జిల్లా హేమాజీ పూర్ లో 15 ఎకరాల భూమి ఉన్నట్టు తేలింది. తాను 2014 కంటే ముందే కొన్నాననీ… 2021లో అమ్మేశానని రజత్ కుమార్ GADకి వివరణ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ భూములు రజత్ కుమార్ పేరునే రికార్డుల్లో కనిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివ బాలకృష్ణను అరెస్ట్ చేసినప్పుడే… రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తన భార్య పేరుతో కొన్న పాతిక ఎకరాల భూమి బయటపడింది. కోట్లల్లో ఉండే భూమిని… ఎకరం కేవలం రెండున్నర లక్షలకే ఎలా కొన్నారన్నది అర్థం కాని ప్రశ్న.
తాను నిజాయతీగా కొన్నట్టు చెబుతున్నా… DOPT కి తన ఆస్తుల కొనుగోళ్ళ వివరాలు ఎందుకు చెప్పలేదు. ఆయన భూముల పక్కనే సన్నిహితుడు 123 ఎకరాలు ఎలా కొన్నాడు. అసలు నిజంగా కొన్నారా… అది కూడా బినామీయేనా అన్న అనుమానాలు మాత్రం తొలగలేదు. శివ బాలకృష్ణ కేసు తర్వాత ఒక్కో IAS అధికారి భూముల కొనుగోళ్ళు వ్యవహారం బయటకు వస్తుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. వీళ్ళు కేసీఆర్, కేటీఆర్ కి దగ్గరగా ఉండే IAS లు కావడం… రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుందో ముందే తెలుసు కాబట్టి… ఆ ఏరియాలో రైతులను బెదిరించి, బుజ్జగించి తక్కువ రేట్లకు భూములు కొని… ఆ తర్వాత భూసేకరణ కింద ప్రభుత్వానికి పదింత రేట్లకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది.
తమ భూములు కొనుగోలు వ్యవహారాలను DOPT కి కూడా తెలపకుండా గుట్టుగా తెలంగాణలో కోట్లల్లో అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో సీనియర్ అధికారుల భూముల కొనుగోళ్ళపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. IAS,IPS, IRS, IFS అధికారులు గత పదేళ్ళల్లో ఎవరు ఎక్కడ ఎంత భూమి కొన్నారో కూపీ లాగుతున్నారు. ప్రభుత్వం ACB విచారణకు ఆదేశిస్తే ఇంకా ఎంతమంది అధికారుల అక్రమ సంపాదన బయటకు వస్తుందో చూడాలి. ఒకవేళ అవి బీఆర్ఎస్ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలు అయితే వాళ్ళపైనా కేసు పెట్టాలని జనం కోరుతున్నారు.