Telangana BJP Leaders : వచ్చారు… పోయారు…తెలంగాణలో ఆ బీజేపీ లీడర్లు ఎక్కడ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసిన అభ్యర్థుల్లో సగానికి సగం మంది ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. టెలిస్కోప్‌కు కూడా దొరక్కుండా తిరుగుతున్నారట. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి ఏమైనా పనికొస్తారేమోనని పార్టీ అగ్రనాయకత్వం చుక్కానీ పట్టుకు తిరుగుతున్నా... ఎక్కడా ఆచూకీ దొరకడం లేదన్నది ఇంటర్నల్ టాక్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసిన అభ్యర్థుల్లో సగానికి సగం మంది ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. టెలిస్కోప్‌కు కూడా దొరక్కుండా తిరుగుతున్నారట. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి ఏమైనా పనికొస్తారేమోనని పార్టీ అగ్రనాయకత్వం చుక్కానీ పట్టుకు తిరుగుతున్నా… ఎక్కడా ఆచూకీ దొరకడం లేదన్నది ఇంటర్నల్ టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది 2018 ఎన్నికల తరవాత కాషాయ పార్టీలో చేరినవాళ్ళే. పార్టీ సిద్ధాంతాలను నమ్మి, ఆ లైన్‌లో ఉండి, బీజేపీ (BJP) తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన వారు చాలా తక్కువ మందే గత ఎన్నికల్లో పోటీ చేశారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసిన పార్టీ అధినాయకత్వం… దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్నవాళ్ళను పక్కన పెట్టి కొత్త వారికి ఎక్కువగా టిక్కెట్స్ ఇచ్చిందన్న అసంతృప్తి అంతర్గతంగా ఉంది. ఇప్పుడు అందుకు తగ్గట్టే కొత్త నేతలు పత్తా లేకుండా పోవడంతో తేడా తెలుసుకోమని అంటున్నారట పాత నాయకులు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసింది బీజేపీ. అందులో 70 మంది అభ్యర్థుల దాకా 2018 తర్వాత బిజెపిలో చేరిన వారే. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నోటిఫికేషన్ వచ్చాక, చేరిన పది మందికి పైగా సీట్లు దక్కాయి. గతంలో ఎన్నికల పోటీ పరంగా బీజేపీ వాసనే తెలియని 85 మంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలో దిగారు. అలా పోటీ చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు పార్టీతో టచ్ లో లేరట. సుమారు 60 మంది వరకు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదంటున్నారు. వాళ్ళసలు స్థానిక నాయకత్వానికి కూడా అందుబాటులో లేరట… లోకల్ లీడర్స్ పని లేకుండా, అసలు వాళ్ళకి తెలియకుండా చాలా మంది కేవలం టికెట్ కోసమే బీజేపీలో చేరారు. అలాంటివాళ్ళంతా ఎన్నికలు అయ్యాక మాయమైపోయారన్న టాక్.. తెలంగాణ బీజేపీలో ఉంది.
ఇందులో కొద్ది మందిని పార్టీ పట్టించుకోకపోవడం ఒక కారణమైతే… కేవలం అవసరం కోసమే వచ్చిన మరికొద్ది మంది గాయబైపోయారని అంటున్నాయి బీజేపీ వర్గాలు. దీంతో టికెట్ కోసమే పార్టీలోకి వచ్చిన వారికి ప్రేమ ఎందుకు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా టికెట్ లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు కార్యకర్తలు. ఎన్నికల ముందు వస్తారు టికెట్ తెచ్చుకుంటారు… వాళ్ళ కోసం మేం పని చేయాలి. ఎన్నికలు ముగియగానే వాళ్లు వెళ్లి పోతారు.. మళ్ళీ ఎప్పటిలాగే పార్టీ జండాను మేమే మోయాలని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం నిట్టూరుస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన వారందరినీ పార్టీ లైన్ లోకి తెచ్చేందుకు పెద్దలు ఏమైనా ప్లాన్ చేస్తారా… ? లేక లోపల ఉన్నోడే మనోడంటూ సర్దుకుపోతారా అన్నది చూడాలి.