ఫోన్‌ ట్యాపింగ్ కేసు మడతెట్టేశారా? అసలు క్రిమినల్స్‌ని వదిలేశారా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2024 | 03:21 PMLast Updated on: Aug 24, 2024 | 3:21 PM

What Happened In Telangana Phone Tapping Case

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు… ఎందుకో.. ఎక్కడో ఆగిపోయినట్లుగా అనిపిస్తోంది. తెలంగాణ సీఐడీ బాస్ ఇటీవలే ఈ కేసుపై సీబీఐతో సమావేశం అయ్యారు. ఇంటర్‌పోల్‌ సహకారంతో అమెరికాలో ఉన్న నిందితుల్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ కేసు ప్రచారానికి ఉపయోగపడిందే తప్ప… దర్యాప్తుపరంగా ఎక్కడో ఆగిపోయిందనేది.. ఇంటా బయటా వినిపిస్తున్న టాక్. ఫోన్ ట్యాపింగ్‌ కేసు రోజుకో మలుపు తిరిగినప్పటికీ… అసలు దోషుల వరకు పోలీసులు చేరుకోలేకపోయారు. ట్యాపింగ్‌లో కీలకంగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు… ఐన్యూస్‌ ఛానల్ ఎండీ శ్రవణ్‌రావును ఇప్పటివరకు అధికారులు పట్టుకోలేకపోయారు. అంతేకాదు… ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కూడా టచ్ చేయలేకపోయారు. కీలక నిందితులను పట్టుకుంటే కానీ… అప్పటి ప్రభుత్వ పెద్దలను టచ్ చేయలేమని చెప్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు పదేపదే చెప్తున్నప్పటికీ… వాళ్లను ఎప్పుడు పిలిపిస్తారు… ఎప్పుడు ప్రశ్నిస్తారు అన్న దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. కనీసం నోటీసులు ఇచ్చి… వారి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తారా అంటే అది కూడా చేయలేదు. ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ పేరు పదేపదే వచ్చినప్పటికీ… పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారు. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావు… ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చి ప్రశ్నించలేకపోయారు. ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు… హరీష్ రావుకి అత్యంత సన్నిహితులు అన్నది అందరికీ తెలిసిందే. ఒక ప్రైవేట్ వ్యక్తి… ప్రభుత్వ, ముఖ్యంగా పోలీసు వ్యవస్థల్ని ఎలా కంట్రోల్ చేశాడు… ఎలా శాసించగలిగాడు అన్న ఒక్క పాయింట్‌పై ఇప్పటివరకు, అప్పటి ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించలేకపోయారు. కేసు నమోదైన తర్వాత అమెరికా వెళ్లి అజ్ఞాతంలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు ఇండియాలో గాలిస్తున్నారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్‌ ఛానల్ ఎండీ శ్రవణ్‌రావు కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నామని చెప్తున్నారు.

అమెరికాలో దాక్కున్న ఈ ఇద్దరినీ దేశానికి రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇటీవలే సీఐడీ చీఫ్ సీబీఐని కలిసి ఇంటర్‌పోల్‌ సహకారం కోసం అభ్యర్థించారు. డిపార్ట్మెంట్ నుంచి ఒక టీంని అమెరికా పంపినట్లుగా కూడా చెబుతున్నారు. కానీ ఎక్కడ కదలిక ఉన్నట్లుగా కనిపించడం లేదు. వ్యవహారం బయటపడి దాదాపు 7నెలలు దాటిపోయినా… ఇప్పటివరకు ఆ ఇద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసు డిపార్ట్మెంట్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదై ఇన్నాళ్లు అవుతున్నా… కేసులో కీలకంగా ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆగ్రహించింది న్యాయస్థానం. వాళ్లిద్దరినీ కూడా వెంటనే అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో అరెస్ట్‌ అయిన నలుగురు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఐదుసార్లు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ… వారి పిటిషన్లను కోర్టు కొట్టేసింది. నిందితులు బయటికి వెళ్తే… సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో బెయిల్‌ నిరాకరించింది.

నిందితులు తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీతరావు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఏఎస్పీ భుజంగరావుకు కొద్దిరోజుల క్రితమే గుండె చికిత్స కోసం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హార్ట్ ట్రీట్మెంట్‌లో ఉన్నారు. ఈ నలుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు… అప్పట్లో సంచలనం సృష్టించాయి. జడ్జిలు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ నేతలు ఇలా ఒకరేమిటి… ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని ఆ నలుగురు నిందితులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ట్యాపింగ్‌కు పాల్పడ్డామని తెలిపారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు చేరకుండా ఉండేందుకు పలు ఆపరేషన్ చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను టాప్ చేసి డబ్బుని పట్టుకున్నామన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని హవాలా అని ఐటీకి చెప్పామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాక బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల డబ్బులు మాత్రం నేరుగా పోలీస్ వాహనాల్లోనే తరలించినట్లు చెప్పారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల ఫోన్లు, బంధుమిత్రులు, ఆయనకు సాయం చేస్తున్న ఫోన్లను కూడా ట్యాప్‌ చేశామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ ట్యాపింగ్ వ్యవహారమంతా SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ కనుసన్నుల్లో జరిగినట్టు తెలిపారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి ఇంటితో పాటు ఆయన ఆఫీసు దగ్గర ప్రత్యేకంగా చిన్నపాటి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని కూడా విచారణలో తెలిపారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశామన్నారు. మరోవైపు… నాంపల్లి కోర్టు కూడా సిట్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరారీలో ఉన్న ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌రావుని ఎప్పుడు అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి త్వరలోనే అరెస్టు చేస్తామని… సిట్ అధికారులు నాంపల్లికి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యవహారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఫోన్లు టాప్ చేసి… వాళ్ళ అంతర్గత వ్యవహారాలు తెలుసుకొని దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేసి… బి ఆర్ ఎస్ పార్టీకి భారీగా ఎన్నికల నిధులు సమకూర్చారు. అలాగే ఆ పార్టీకి ఎలక్ట్రోలర్స్ బాండ్స్ ద్వారా కోట్ల రూపాయల నిధులు సమీకరించారు . ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం ఇది. ఇదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశ్నిస్తే.. అసలు ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రికి సంబంధం ఏమిటని… అది ఇంటిలిజెన్స్ పోలీసులు చూసుకునే వ్యవహారమని చాలా తెలివిగా సమాధానం చెప్పారు. కేటీఆర్ అయితే మరి అహంకారంతోనూ, వెటకారంతోనూ సమాధానం ఇచ్చారు. ఆ చేస్తే చేసి ఉంటాము… ఒకరో ఇద్దరో… లుచ్చాగాళ్ళవి, దొంగలవి, లంగలవి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావేమో అని స్వయంగా చెప్పాడు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు టాపింగ్ చేయడం ఒక భయంకరమైన నేరం అయితే… ఫోన్ ట్యాప్‌ చేసి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అసలు చేయడం అంతకన్నా పెద్ద నేరం. ఇలాంటి దారుణమైన కేసుని మొదట్లో నానా హంగామా చేసి సైలెంట్ అయిపోవడం పైనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలకు, ఎన్నికల ప్రచారాలకు మాత్రమే ఇది ఉపయోగపడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, అమెరికా నుంచి ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని మెడ పట్టుకుని గుంజుకొచ్చి, ఆ తర్వాత ఈ కేసు వెనుకున్న పెద్దల్ని కూడా ఉనికి ఇస్తేనే రేవంత్ సర్కార్ నిజాయితీ నిలబడుతుంది.