Donald Trump: ట్రంప్ వాష్‌రూమ్‌లో అమెరికా న్యూక్లియర్ సీక్రెట్స్..!! ఎంత పనిచేశావ్ నాయకా..!

అత్యంత రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా భద్రంగా ఉండాల్సిన పత్రాలు ఎక్కడున్నాయో తెలుసా..? ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ రిసార్ట్ మర్-అ-లాగోలో. పెంటగాన్ ప్రధాన కార్యాలయంలోనో.. లేక వైట్ హౌస్ ఆఫీసులోనో ఉండాల్సిన రహస్య పత్రాలు.. ఏకంగా ట్రంప్ పర్సనల్ రిసార్ట్‌లో కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 02:24 PMLast Updated on: Jun 10, 2023 | 2:24 PM

Bathroom To Ballroom Pics Show Where Trump Kept Secret Docs At His Home

Donald Trump: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అణు కార్యక్రమాల వివరాలు, అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన రక్షణ, ఆయుధ సంపత్తికి సంబంధించిన రహస్య సమాచారాలు.. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలపై దాడులు జరిగే అవకాశమున్న సమాచారం.. ఒక వేళ విదేశీయులు దాడులు చేస్తే.. ఎలా తిప్పికొట్టాలో వివరించే సీక్రెట్ డాక్యుమెంట్స్.. ఇలా ఒక్కటేంటి.. అత్యంత రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా భద్రంగా ఉండాల్సిన పత్రాలు ఎక్కడున్నాయో తెలుసా..? ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ రిసార్ట్ మర్-అ-లాగోలో. అవును.. పెంటగాన్ ప్రధాన కార్యాలయంలోనో.. లేక వైట్ హౌస్ ఆఫీసులోనో ఉండాల్సిన రహస్య పత్రాలు.. ఏకంగా ట్రంప్ పర్సనల్ రిసార్ట్‌లో కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి.

అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయన ఎలాంటి పత్రాలనైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే అధికారం, వెసులుబాటు ఉంటుంది. కానీ ఒక్కసారి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. దేశ వ్యవహారాలకు సంబధించిన ఎలాంటి రహస్య పత్రాలను వ్యక్తిగతంగా ఉంచుకోకూడదు. శ్వేతసౌధం వీడే సమయంలోనే వాటిని అధికారులకు అప్పగించాలి. కానీ ట్రంప్ అలా చేయలేదు. వైట్‌హౌస్ నుంచి తట్టాబుట్టా సర్దుకున్నప్పుడు రహస్య పత్రాలను కూడా తనతో పాటే తీసుకెళ్లారు. ఇదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. ఈ కారణంగా అమెరికా చరిత్రలోనే ఫెడరల్ క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా మరక అంటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్.
రహస్య పత్రాలు దాచిపెట్టి అబద్దాలు చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షల మీద ఒక మొరటు సామెత ఉంది. అధ్యక్షుడిగా ఉన్నంతకాలమే వాళ్ల హవా. ఆ తర్వాత వాళ్లను కుక్కలు కూడా పట్టించుకోవు అని. అమెరికా ప్రెసిడెన్షియల్ పాలిటిక్స్‌ను లోతుగా అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతూ ఉంటారు. అధ్యక్ష హోదాలో ట్రంప్ ఎంత మిడిసిపడినా ఒక్కసారిగా ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన సాధారణ పౌరుడే. ఏదైనా నేరం చేసినట్టు రుజువైతే మాజీ అధ్యక్షుడు కదా అని ఆయనపై అవసర ప్రేమ కురిపించరు. మన దేశంలో కేవలం కాగితాల వరకు మాత్రమే చట్టం తనపని తాను చేసుకుపోతూ ఉంటుంది. కానీ అమెరికాలో చట్టం నిజంగానే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ట్రంప్ విషయంలోనూ అదే జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికార మార్పిడి సమయంలో ట్రంప్ చట్టప్రకారం వ్యవహరించలేదని, వందలాది రహస్యపత్రాలను తనతో పాటు ప్రైవేటు రిసార్టుకు తీసుకెళ్లారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. ఈ విషయం వెలుగులోకి రాగానే ట్రంప్ పదేపదే ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన దగ్గర ఎలాంటి రహస్య డాక్యుమెంట్లు లేవని గొంతుచించుకున్నారు. కానీ ఎఫ్‌బీఐ ఊరుకుంటుందా..? ట్రంప్ ప్రైవేట్ రిసార్టును జల్లెడ పడితే పెట్టెలకు పెట్టెలుగా రహస్య పత్రాలు బయపడ్డాయి.
ఇంతకీ ట్రంప్ ఎలా దొరికిపోయారు ?
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2021 జనవరి 14న డొనాల్డ్ వైట్‌హౌస్ ఖాళీ చేశారు. అయితే అంతకు కొన్ని రోజుల ముందే డజన్ల కొద్దీ బాక్సులను వైట్‌హౌస్ నుంచి తరలించారు. జనవరి 18న ఫ్లోరిడాలోని ట్రంప్ ప్రైవేట్ హౌస్‌కు ఈ బాక్సులు చేరుకున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకు ట్రంప్‌ కూడా మర్-అ-లాగో వెళ్లారు. అధ్యక్ష మార్పిడి జరిగినప్పుడు పాత అధ్యక్షుడి అధికారిక రికార్డులన్నింటినీ ఆర్కైవ్‌కు తరలిస్తారు. వీటిని పర్యవేక్షించడానికి అమెరికాలో నేషనల్ ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ప్రెసిడెన్షల్ రికార్డ్స్ యాక్ట్ ప్రకారం డాక్యుమెంట్లు అన్నీ చట్ట ప్రకారం భద్రపరిచారా లేదా అన్నది వీళ్లు చూస్తారు. అయితే ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేసిన తర్వాత కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్టు 2021 మే 6న అధికారులు గుర్తించారు. దీనిపై ట్రంప్ బృందానికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అప్పటికే కీలకమైన డాక్యుమెంట్లు ఉన్న బాక్సులన్నింటినీ ట్రంప్ ఇంట్లో ఎక్కడపడితే అక్కడ సర్దేశారు. విషయం బయటకు పొక్కడంతో వాటిలో కొన్ని బాక్సులను ట్రంప్ టీమ్ నేషనల్ ఆర్కైవ్స్ విభాగానికి తిరిగి ఇచ్చేశారు. బాక్సులను పరిశీలించిన అధికారులు వాటిలో అత్యంత కీలకమైన రహస్య సమాచారం కూడా ఉన్నట్టు తేల్చారు. దీంతో విచారణ జరిపేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. గతేడాది మార్చిలో ఎఫ్‌బీఐ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. వివిధ సందర్భాల్లో ట్రంప్ హౌస్‌ని సెర్చ్ చేసిన ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ సీక్రెట్ డాక్యుమెంట్లను దాచిపెట్టిన విధానాన్ని చూసి షాక్ అయ్యారు.
బాత్‌రూమ్.. బాల్‌రూమ్..కిచెన్.. ఎక్కడపడితే అక్కడే
కాలకృత్యాలు తీర్చుకునే టాయ్‌లెట్‌ రూమ్‌లో దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు ఉంచుతారని ఎవరైనా ఊహిస్తారా? కానీ ట్రంప్ అదే పనిచేశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌‌మెంట్ విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. బాత్‌రూమ్.. బాల్‌రూమ్.. అన్న తేడా లేకుండా ఇంట్లో అన్ని చోట్లా రహస్య పత్రాలు ఉన్న బాక్సులను పేర్చేశారు. ట్రంప్ ఇంట్లో ప్రైవేటు పార్టీలు జరగడానికి పెద్ద హాల్ ఉంటుంది. అందులో నుంచి ఈ బాక్సులు ఉంచిన ప్లేస్‌లోకి ఈజీగా వెళ్లొచ్చు. తన వద్ద కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్న విషయాన్ని ట్రంప్ స్వయంగా కొన్ని ప్రైవేటు సంభాషణల్లో అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎఫ్‌బీఐ ఆధారాలతో సహా నిరూపించింది. మొత్తానికి ట్రంప్ ఇంట్లో 11 వేలకు పైగా ప్రభుత్వ పత్రాలను గుర్తించిన అధికారులు వాటిలో 31 కాన్ఫిడెన్షల్, 54 సీక్రెట్, 18 టాప్ సీక్రెట్ పత్రాలు ఉంచినట్టు తేల్చారు.
పుట్టినరోజు నాడే కోర్టు ముందుకు
ఈనెల 14న 77వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ అదే రోజు మియామీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు అందడంతో ట్రంప్‌కు తప్పనిసరి పరిస్థితిలో న్యాయమూర్తి ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న ట్రంప్.. సీక్రెట్ డాక్యుమెంట్ కేసులో దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సమయంలో ఇది ట్రంప్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి.
పాపం ట్రంప్.. కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా ?
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు..! శ్వేత సౌధంలో రాజభోగాలు అనుభవించారు..! ఆ రోజుల్లో ఆయన మాటే ఒక శాసనం. ఆయన్ను కలవడానికి ప్రపంచ దేశాధినేతలు వైట్ హౌస్‌ముందు క్యూ కట్టేవారు..! అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే కాదు.. అంతకు ముందు కూడా ఆయనది రాజభోగమే. ఎందుకంటే అమెరికాలోనే బడా వ్యాపారవేత్త. ఆయనకున్న ఆస్తులకు లెక్కలేదు. అలాంటి మనిషి ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 76 యేళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్‌కు అనేక కేసులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఫెడరల్ కోర్టు నుంచి లోకల్ కోర్టు వరకు ఎప్పుడు ఏ కేసులో ఏ న్యాయస్థానం నుంచి సమన్లు వస్తాయో అర్థంకాని పరిస్థితి. మరోసారి అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచి.. శ్వేతసౌధాన్ని మళ్లీ ఏలుదామనుకుంటున్న ట్రంప్‌ను పాత కేసులు పదేపదే వెంటాడుతున్నాయి. తాజా కేసులతో చివరి వరకు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రేసులో నిలవగలరా లేక రిపబ్లికన్లు ఆయన్ను తప్పిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.