Cyclone Biparjoy: బిపర్‌జాయ్ బీభత్సం.. అల్లకల్లోలంగా గుజరాత్.. చీకట్లోనే 900 గ్రామాలు
బిపర్‌జాయ్ తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Cyclone Biparjoy: బిపర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుపాను గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్‌లోని కచ్ వద్ద తీరం దాటింది. ఇక్కడి నుంచి ఈ తుపాన్ పాకిస్తాన్‌లోని కరాచీ వైపు వెళ్తోంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారగా, సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గుజరాత్‌లో భారీ విధ్వంసమే సృష్టించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాళ్లు అందించిన సమాచారం ప్రకారం.. బిపర్‌జాయ్ తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం కచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు, హాస్పిటల్స్‌లోకి నీరు చేరింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇండ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటివి కూలిపోవడం వల్ల పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 52 వేల మందితోపాటు, 25 వేల వరకు పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ప్రైవేటు ఆస్తులతోపాటు, ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. పలు పవర్ స్టేషన్లు కూలిపోయాయి. అనేక చోట్ల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
రైళ్లు రద్దు
బిపర్‌జాయ్ తుపాను కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్ద చేయడంతోపాటు ఇంకొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భావ్ నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న పశువులను కాపాడేందుకు వెళ్లి తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. వివిధ ఘటనలో పలువురు గాయపడ్డారు. కొన్నిచోట్ల పశువులు కూడా మరణించాయి. గుజరాత్‌లోనే కాకుండా.. రాజస్థాన్‌లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో బల్మేర్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా ఉంది. మరోవైపు ఈ పరిస్థితిపై ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. తుపాను నివారణ చర్యల గురించి చర్చించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.