Sundar Pichai: ఇల్లు అమ్మేసిన గూగుల్ సీఈవో తండ్రి.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు!
సుందర్ పిచాయ్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని తాజాగా ఆయన తండ్రి రఘునాథ పిచాయ్ విక్రయించారు. ఈ క్రమంలో రఘునాథ భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆ ఇంటిని కొనుగోలు చేసిన సినీ నిర్మాత, నటుడు మణికందన్ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి విక్రయం పూర్తైంది.
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇండియాలో జన్మించాడనే సంగతి తెలిసిందే. ఇక్కడే విద్యాభ్యాసం కూడా పూర్తి చేసి, అమెరికా వెళ్లి అక్కడ గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగాడు. ఆయన బాల్యం అంతా తమిళనాడులోని చెన్నైలోనే గడిచింది. సుందర్ పిచాయ్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని తాజాగా ఆయన తండ్రి రఘునాథ పిచాయ్ విక్రయించారు. ఈ క్రమంలో రఘునాథ భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆ ఇంటిని కొనుగోలు చేసిన సినీ నిర్మాత, నటుడు మణికందన్ వెల్లడించారు.
ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి విక్రయం పూర్తైంది. ఈ సమయంలో రఘునాథ పిచాయ్ ఎంతో సహకరించారని మణికందన్ చెప్పారు. ఈ విక్రయానికి సంబంధించిన వివరాల్ని ఆయన మీడియాకు తెలిపారు. సుందర్ పిచాయ్ కుటుంబం గతంలో తమిళనాడులోని అశోక్ నగర్‌లోని ఇంట్లో ఉండేది. ఇటీవల ఆ ఇంటిని విక్రయించాలని సుందర్ పిచాయ్ తండ్రి రఘునాథ భావించారు. ఈ ఇల్లు అమ్మకానికి ఉందని తెలియడంతో మణికందన్ కొనుగోలుకు ముందుకొచ్చారు. సుందర్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలో వారి మర్యాద తమనెంతో ఆకట్టుకుందని మణికందన్ చెప్పారు. సుందర్ తల్లి తనకు ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చినట్లు, మొదటిసారి కలిసినప్పుడే ఇంటి పత్రాలు తనకు అందజేసినట్లు మణికందన్ తెలిపారు. తనతో ఎంతో మర్యాదగా ప్రవర్తించినట్లు చెప్పారు. “ఇంటిని అప్పగించే విషయంలో వాళ్లు ఎంతగానో సహకరించారు. రిజిస్ట్రేషన్ కోసం రఘునాథ పిచాయ్ గంటల తరబడి ఎదురు చూశారు.
ఇంటికి సంబంధించి అన్ని పన్నులు చెల్లించారు. ఇంటిని కూల్చేందుకు అవసరమైన ఖర్చును కూడా రఘునాథే భరించారు. అయితే, ఆ పత్రాలు నాకు అప్పగించే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఆయన మొదటి ఆస్తి కావడంతో భావోద్వేగానికి గురయ్యారు. దేశాన్ని గర్వపడేలా చేసిన సుందర్ పిచాయ్ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడం నా జీవితంలో గొప్ప విజయం” అని మణికందన్ చెప్పుకొచ్చారు. సుందర్ ఉన్నత చదువుల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లే వరకు.. అంటే ఇరవై ఏళ్ల వయసు వరకు ఇక్కడే ఉన్నారని ఆయన చెప్పారు.