Heatwaves: వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది.. వంద మంది మృతి.. 400 మంది ఆస్పత్రుల్లో!
గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వంద మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. 400 మందికిపైగా వడదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో అనేక రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది.
Heatwaves: దేశాన్ని వడగాల్పులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన ఎండ, వడగాల్పుల ప్రభావంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వంద మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. 400 మందికిపైగా వడదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో అనేక రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. జూన్ 15, 16చ, 17 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి వంద మంది మరణించారు. వడదెబ్బ ప్రభావంతో జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో 400 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వాళ్లే ఉన్నారు. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
బాధితులు విషమ పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరడంతో వారికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వంటివి కూడా అమరుస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రోగుల సంఖ్య పెరగడంతో వైద్య సిబ్బందిని కూడా పెంచారు. యూపీ, బిహార్‌లోని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా స్ట్రెచర్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అక్కడి అనేక ప్రాంతాల్లో సగటున 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇది సగటు ఉష్ణోగ్రతకంటే 4.7 డిగ్రీలు అధికం. కొన్ని చోట్ల 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతోంది. బిహార్‌లో స్కూళ్లతోపాటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వరకు సెలవులు పొడిగించారు. ఔరంగాబాద్, నలందా, భోజ్‌పూర్, బక్సర్, కైమూర్ అర్వాల్, బంకా వంటి అనేక నగరాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఈ నెల 30 వరకు వేసవి సెలవుల్ని పొడిగించారు. ఐదో తరగతి వరకు స్కూల్స్ పూర్తిగా మూసేయగా, ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఉదయం పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. బిహార్‌కు సంబంధించి పదేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో వడగాల్పులు రావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.
వడగాల్పుల హెచ్చరిక
ఉత్తర ప్రదేశ్, బిహార్, చత్తీస్‍గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, పశ్చిమ బెంగాల్, తెలంగాణకు అధికారుల వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత క్రమంగా ఎండలు తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు ఎక్కువ వేడిని లేదా అతి చలిని తట్టుకోలేరని, ఇలాంటివాళ్లు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ సమస్యలు ఉన్న వాళ్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. భారీ ఎండల కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం రోడ్లు నిర్మాణుష్యంగా మారుతున్నాయి.