Cheetah Project: మూడు చీతా కూనలు మృతి.. ఒక్కటే మిగిలింది.. చీతాలకు ఎందుకిలా అవుతోంది?
నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23న, దక్ష అనే మరో ఆడ చీతా ఈ నెల 9న మరణించింది. జ్వాల అనే ఆడ చీతాకు ఇటీవల నాలుగు చీతాలు జన్మించాయి. వాటిలో మూడు చీతా కూనలు ఈ వారంలోనే మరణించాయి.
Cheetah Project: నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇండియా తీసుకొచ్చిన చీతాల్లో కొన్ని వరుసగా మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాల నుంచి మొత్తం 20 చీతాల్ని తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు మరణించాయి. ఒక చీతాకు జన్మించిన నాలుగు పిల్లల్లో మరో మూడు కూనలు తాజాగా మరణించాయి. ఇంకా ఒక్క చీతా కూన మాత్రమే మిగిలుంది. దీంతో దేశంలో మరణించిన చీతాల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. ఇలా వరుసగా చీతాలు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవి మన వాతావరణంలో ఇమడలేకపోతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23న, దక్ష అనే మరో ఆడ చీతా ఈ నెల 9న మరణించింది. ఇవి అనారోగ్యంతోపాటు, ఇతర కారణాల వల్ల మరణించినట్లు అధికారులు తెలిపారు. జ్వాల అనే ఆడ చీతాకు ఇటీవల నాలుగు చీతాలు జన్మించాయి. వాటిలో మూడు చీతా కూనలు ఈ వారంలోనే మరణించాయి. ఈ కూనలు ఎండల కారణంగా, డీ హైడ్రేషన్‌కు గురై మరణించాయి. ఈ కూనలు ఉంటున్న కూనో నేషనల్ పార్క్ పరిధిలో 46-47 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యాయి. ఈ ఎండలు తట్టుకోలేక చీతా కూనలు నీరసించాయి. పరిస్థితి గమనించిన అధికారులు వాటిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. వాటికి అత్యవసర చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. కానీ, పరిస్థితి విషమించి మూడు కూనలు మరణించాయి. మిగిలిన కూన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. మొత్తంగా రెండు నెలల్లో ఆరు చీతాలు ప్రాణాలు కోల్పోయాయి.
స్పందించిన సీఎం
నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తెచ్చిన చీతాలు మరణిస్తుండటంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. అధికారులతో శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చీతాల్ని రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే చీతా కూనల మరణాలపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. డీ హైడ్రేషన్, పోషకాహార లోపం కారణంగానే ఇవి మరణించి ఉంటాయని భావిస్తున్నారు. అందుకే ఈ చీతాల తల్లి జ్వాలకు మంచి ఆహారం అందిస్తున్నారు. ఇతర చీతాలకు కూడా సరైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చీతాలు ఇలా మరణిస్తుండటంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన 18 చీతాల్నైనా సంరక్షించాలని కోరుతున్నారు. ఒక కూనతో కలిపి ప్రస్తుతం ఈ నేషనల్ పార్కు పరిధిలో 18 చీతాలున్నాయి.
చీతాల మనుగడ శాతం తక్కువే!
చీతాల మరణంపై నిపుణులు స్పందించారు. సహజంగా చీతాల మనుగడ శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అనేక కారణాల వల్ల చీతాలు తొందరగా మరణిస్తాయన్నారు. కొన్ని మాత్రమే పూర్తి కాలం జీవిస్తాయంటున్నారు. ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, అందువల్ల దేశంలో చీతాల గురించి ఆందోళన అవసరం లేదంటున్నారు. చీతాలకు ఎక్కువ సంఖ్యలో సంతానం కలుగుతుందని, వీటిలో బలహీనంగా ఉన్నవి త్వరగానే మరణిస్తాయని అధికారులు అన్నారు. ప్రస్తుతం మిగిలిన చీతాల్ని రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చీతాలకు మంచి ఆహారం అందించి, వైద్య నిపుణులు వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కూనో పార్కు అనువైన ప్రాంతం కాదా?
చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం చీతాల మనుగడకు కూనో నేషనల్ పార్క్ సరైన ప్రదేశం కాదు. అందుకే వీటిని రాజస్థాన్ తరలించాలని చెప్పారు. చివరకు ఈ అంశంపై సుప్రీం కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ చీతా సమయంలో జంతు సంరక్షణ నిపుణులు, పర్యావరణ వేత్తలు చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కూనో నేషనల్ పార్క్ పరిధిలోని అటవీ విస్తీర్ణం చాలా తక్కువ. పైగా ఇక్కడికి సమీపంలోనే అనేక గ్రామాలున్నాయి. జన సంచారం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట ఇవి మనుగడ సాగించలేవని పలువురు నిపుణులు చెప్పారు. కానీ, కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోకుండా మధ్యప్రదేశ్‌లోనే చీతాల్ని ఉంచిందని విమర్శిస్తున్నారు. కాగా, శుక్రవారం జరగనున్న సీఎం భేటీలో ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.