Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీచేసేది అక్కడి నుంచేనా?
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా
మారింది. ఓటు చీలనివ్వను… వైసీపీని గెలవనివ్వనని ప్రతిజ్ఞ చేసిన జనసేనాని ఏ జిల్లా? ఏ నియోజకవర్గాన్ని తన ఆప్షన్ గా ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఖాయమైనందున అటు టీడీపీకి ఇబ్బందిలేనిది… తను గెలవడానికి అనుకూలమైన నియోజకవర్గాన్ని జనసేనాని ఎంచుకోవాల్సి ఉంది.
ఏపిలో అన్ని పార్టీల కీలక నేతలందరికీ పోటీ చేయడానికి సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కే సొంత నియోజకవర్గం అంటూ ఒకటి లేకుండాపోయింది. ఆయన పుట్టింది ఒక చోట తండ్రి ఉద్యోగ రీత్యా పెరిగి పెద్ద అయ్యింది వివిధ ప్రాంతాల్లో. స్టూడెంట్ గా.. నటునిగా…చెన్నై లో జీవితం. దాంతో ఆయనకు సొంత జిల్లా, సొంత నియోజక వర్గం లేకుండాపోయాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. మరి ఈసారి మళ్లీ అక్కడే పోటీ చేస్తారా? సీట్ మారుస్తారా? అనే సందేహం ఆ పార్టీ కేడర్ లో ఉంది. భీమవరం, గాజువాకలను పవన్ వదిలేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం సీక్రెట్ అంటున్నాయి.
ప్రత్యర్ధుల ఎత్తులకు దొరకకుండా ఉండేందుకే పవన్ కల్యాణ్ పార్టీ ఆయన పోటీ చేసే నియోజకవర్గాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నట్టు కనిపిస్తోంది. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన నేత అంటూ వైసీపీ తరచూ పవన్ ను ఎగతాళి చేస్తోంది. అందుకే ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు పవన్. అందుకోసం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు ఎక్కువ. పిఠాపురం కాపులు కూడా ఎక్కువే. 2009లో వంగా గీత ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా గెలిచారు. ఏ రకంగా చూసినా పవన్ కల్యాణ్ కు పిఠాపురమే సేఫ్టీ సీట్ అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే సేఫ్టీగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుచెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిఠాపురంలో కాపు నేతలు… జనసేన కార్యకర్తలు కూడా పవన్ పోటీచేస్తే గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు.
పార్టీ మాత్రం పవన్ పోటీ చేసే సీట్ టాప్ సీక్రెట్ లిస్ట్ లో పేట్టేసింది. ఎవరూ ఎక్కడా నోరు విప్పడం లేదు. పిఠాపురం అనేది పాత లెక్కలతో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని చెబుతున్నారు. రాజకీయాల్లో భిన్నంగా వ్యవహరించే పవన్…. ఈ దఫా నియోజకవర్గం ఎంచుకోవడంలోనూ విభిన్నంగా ఉంటారా? అనే సందేహాలు లేకపోలేదు. 2009లో చిరంజీవి గెలిచిన తిరుపతి నియోజకవర్గం పేరు కూడా పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో ఉండొచ్చనే ప్రచారం జరిగినా… అందుకు అవకాశాలు తక్కువ .అయితే ముందరే తొందరెందుకని… ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండటంతో… ఇప్పుడే సేనాని పోటీ చేసే నియోజకవర్గాన్ని బయటపెడితే ఇబ్బందిపడతామనే ఆలోచనలో ఉంది జనసేన.