TDP bad Incidents: ఏ నిమిషానికి ఏమి జరుగునో..! టీడీపీలో టెన్షన్..!!
నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్రను తెలుగుదేశం పార్టీ (TDP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాలని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అందుకే కుప్పం (Kuppam) నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దిగ్విజయంగా సాగేలా అడుగడుగునా పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుంటున్నాయి. ప్రభుత్వం నుంచి భద్రత దొరుకుతుందో లేదో అనే అనుమానాలున్నాయి. అందుకే సొంతంగానే లోకేశ్ భద్రతా ఏర్పాట్లు చేసుకుంది టీడీపీ. అయితే టీడీపీని ఇప్పుడు మరో టెన్షన్ వెంటాడుతోంది.
సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా అనేక జాగ్రత్తలు తీసుకుంటుందనే పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆ పార్టీ కార్యక్రమాల్లో అపశృతులు ఎక్కువయ్యాయి. చంద్రబాబు (Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అది అనేక విమర్శలు తావిచ్చింది. ప్రచార ఆర్భాటంకోసం జరిగిన తొక్కిసలాటగా ప్రతిపక్షం ఆరోపించింది. ఇప్పటికీ దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటోంది వైసీపీ.
తాజాగా కందుకూరులో (Kandukur) చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరుకు సందుల్లో సభ నిర్వహించడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం, తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని టీడీపీ ఆరోపించింది. ఆ ఘటన మరువక ముందే గుంటూరులో (Guntur) సంక్రాంతి కానుక పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల వ్యవధిలోనే 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మరణాల వెనుక కుట్ర ఉందేమోనని టీడీపీ ఆరోపిస్తోంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకోవడం కామన్. కానీ అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు నారా లోకేశ్ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజే వారి కుటుంబసభ్యుడు తారకరత్న (Tarakaratna) గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలిరోజే ఇలాంటి సంఘటన జరగడం టీడీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ఈ మధ్య ఏ కార్యక్రమం చేపట్టినా ఏదో ఒక అపశృతి ఆ పార్టీని వెంటాడుతోంది. అందుకే ఎప్పుడు ఏం జరుగుతోందోననే టెన్షన్ టీడీపీ నేతలకు పట్టుకుంది.