Kolkata-Bangkok highway: కోల్‌కతాకు.. థాయ్‌లాండ్‌కు రోడ్డు మార్గం.. 2027లో అందుబాటులోకి

2027 వరకు ఇండియా-థాయ్‌లాండ్‌ మధ్య రోడ్డు మార్గం అందుబాటులోకి రాబోతుంది. దీనికోసం కో‌ల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే థాయ్‌లాండ్‌కు పర్యాటకంగా మేలు జరిగితే.. వాణిజ్య పరంగా ఇండియాకు లాభం కలుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 16, 2023 | 04:31 PMLast Updated on: Jun 16, 2023 | 4:31 PM

The Kolkata Bangkok Highway Which Is Likely To Open In 2027

Kolkata-Bangkok highway: థాయ్‌లాండ్‌ (బ్యాంకాక్) వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిందే. అయితే, భవిష్యత్తులో ఈ అవసరం ఉండకపోవచ్చు. ఎంచక్కా రోడ్డు మార్గంలోనే ఇండియా నుంచి నేరుగా థాయ్‌లాండ్‌ వెళ్లిపోవచ్చు. ఔను..! 2027 వరకు ఇండియా-థాయ్‌లాండ్‌ మధ్య రోడ్డు మార్గం అందుబాటులోకి రాబోతుంది. దీనికోసం కో‌ల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే థాయ్‌లాండ్‌కు పర్యాటకంగా మేలు జరిగితే.. వాణిజ్య పరంగా ఇండియాకు లాభం కలుగుతుంది.
బిమ్స్‌టెక్ ప్రాజెక్టులో భాగంగా
ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్‌టెక్) ప్రాజెక్టులో భాగంగా కో‌ల్‌కతా-బ్యాంకాక్‌కు హైవే నిర్మాణం జరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పర్యాటక సంబంధాల మెరుగు కోసం ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ హైవే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది త్రైపాక్షిక ప్రాజెక్టు. దీనిలో ఇండియా, థాయ్‌లాండ్‌తోపాటు మయన్మార్ కూడా పాలు పంచుకుంటున్నాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో.. అంటే 2002 ఏప్రిల్‌లో దీన్ని ప్రతిపాదించారు. ఆగ్నేయాసియా దేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపొందించే లక్ష‌్యంతో దీన్ని ప్రతిపాదించారు. బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఇండో-మయన్మార్ మధ్య 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 2009లో సన్నాహాలు ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తర్వాత 2012లో దీనికి నిధులు వెచ్చించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. అయితే, అనంతరం మోదీ అధికారంలోకి వచ్చేదాకా ఇది ముందుకు సాగలేదు. అనంతరం 2016లో ఇండియా-మయన్మార్ మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. దీనికి మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. తర్వాత ఇది త్రైపాక్షిక ప్రాజెక్టుగా మారింది. థాయ్‌లాండ్‌ కూడా దీనిలో భాగస్వామి అయింది. ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్‌ మధ్య ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది.
త్వరలో రవాణా ఒప్పందం
మరో నాలుగేళ్లలో ఈ రోడ్డు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో త్వరలోనే మోటార్ వెహికల్ ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. అంటే మూడు దేశాల మధ్య వాహనాలకు అనుమతి, కార్గో, ప్రైవేటు, ప్యాసింజర్ వాహనాలను అనుమతించే విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్, ట్రాఫిక్, ఇతర అంశాలపై ఒప్పందం కుదరనుంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రోడ్డు మార్గంలో ఉన్న కలేవా-యార్ గ్యి స్ట్రెచ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులతో సమస్య ఉంది. వాళ్లతో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోబోమని అక్కడి అరాకన్ ఆర్మీ ప్రకటించింది.
2,800 కిలోమీటర్ల హైవే
మూడు దేశాలను కలుపుతూ ఏర్పడనున్న ఈ హైవే దాదాపు 2,800 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. అత్యధికంగా ఇండియాలోనే ఉంటుంది. థాయ్‌లాండ్‌లో తక్కువ రోడ్డు ఉంటుంది. బ్యాంకాక్ నుంచి ప్రారంభమై, సుఖోతాయ్, మండాలే మీదుగా మయన్మార్.. అక్కడి నుంచి కోహిమా, మోరే, శ్రీరాంపూర్, గువహటి, కోల్‌కతా, సిలిగురి వరకు ఈ హైవే సాగుతుంది. థాయ్‌లాండ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా వరకు నిర్మాణం పూర్తైంది. ఇండియాలోనూ నిర్మాణం సాగుతోంది. 2027కల్లా ఇది అందుబాటులోకి వస్తుంది.