Elon Musk: ట్విట్టర్‌లో త్వరలో ఆడియో, వీడియో కాల్స్.. మస్క్ సంచలన ప్రకటన

ట్విట్టర్‌లో త్వరలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు మెసేజెస్ చేసుకునే ఫీచర్స్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఏ ట్విట్టర్ యూజర్‌కైనా ఇకపై నేరుగా మెసేజ్ చేయొచ్చు. ఎమోజీలు కూడా వాడుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2023 | 01:41 PMLast Updated on: May 10, 2023 | 1:41 PM

Twitter Soon To Have Audio Video Features Says Elon Musk

Elon Musk: ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ గతేడాది ప్రకటించినట్లుగానే ట్విట్టర్ 2.0 సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగానే సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాడు మస్క్. ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు రాబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. ట్విట్టర్‌లో త్వరలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు మెసేజెస్ చేసుకునే ఫీచర్స్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఏ ట్విట్టర్ యూజర్‌కైనా ఇకపై నేరుగా మెసేజ్ చేయొచ్చు. ఎమోజీలు కూడా వాడుకోవచ్చు.

ఇక త్వరలో ట్విట్టర్ నుంచి ట్విట్టర్‌కు ఆడియో కాల్స్ లేదా వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ట్విట్టర్ యూజర్ నుంచి మరో ట్విట్టర్ యూజర్‌కు డైరెక్ట్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడివాళ్లకైనా ఇలా కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని మస్క్ తెలిపాడు. ఇలాంటి ఫీచర్లు ఇప్పటికే మెటాకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. ట్విట్టర్ మెసేజెస్ ఎన్‪క్రిప్టెడ్‌గా ఉంటాయి. అయితే, కాల్స్ కూడా ఎన్‪క్రిప్టెడ్‌గా ఉంటాయా.. లేదా అని వెల్లడించలేదు. ఎన్‪క్రిప్టెడ్‌ అంటే.. యూజర్‌కు, యూజర్‌కు మధ్య మరొకరు కాల్స్ వినడం, లేదా మెసెజేస్ చదవడం వంటి వాటికి అవకాశం ఉండదు. కంపెనీకి వీటిపై ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఇది యూజర్లకు ప్రైవసీ ఇస్తుంది. ట్విట్టర్‌లో లాంగ్ ఫామ్ మెసేజెస్, పేమెంట్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ట్విట్టర్ బ్లూ టిక్ పేమెంట్ సర్వీస్ వంటి ఫీచర్ కూడా మస్క్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వాడకుండా ఉన్న ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేయబోతున్నట్లు కూడా మస్క్ తెలిపాడు. ఇకపై ట్విట్టర్ అకౌంట్ కంటిన్యూ అవ్వాలంటే నెలకోసారైనా లాగిన్ అవ్వాలి. ఇలా యాక్టివ్‌గా ఉంటేనే ట్విట్టర్ కంటిన్యూ అవుతుంది. లేదంటే డిలీట్ చేస్తామని సంస్థ తెలిపింది. ప్రస్తుతం మస్క్ చెప్పినట్లు కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మొబైల్ నెట్‌వర్క్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు. వాట్సాప్‌కు కూడా నష్టమే. ఈ సర్వీసుపై మొబైల్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. గతంలో వాట్సాప్ కాల్స్ ఉచితంగా చేసే ఫీచర్ విషయంలో మొబైల్ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కాల్స్ వల్ల తమ ఆదాయం తగ్గుతుందని మొబైల్ కంపెనీలు గగ్గోలు పెట్టాయి.