US-India Drone Deal: భారత అమ్ములపొదిలో సీ గార్డియన్ డ్రోన్స్..! మోదీ అమెరికా టూర్‌లో ఈ డీలే ప్రధాన ఎజెండా..!
వివిధ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించే అమెరికా ఓ ఆయుధ ఒప్పందం విషయంలో చాలా కాలంగా మనదేశం వైపే చూస్తోంది. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టనుండటంతో బైడెన్ ప్రభుత్వం ఈ డీల్‌ను ఓకే చేయించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.
US-India Drone Deal: రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనగానే అందులో రక్షణ ఒప్పందాలు, అమ్మకాలు, కొనుగోళ్లు కచ్చితంగా ఉంటాయి. పైగా భారత్, అమెరికా లాంటి రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల బంధానికి ఆయుధాలు వారధిగా నిలుస్తాయి. దేశాధినేతల పర్యటనల్లో డిఫెన్స్ డీల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించే అమెరికా ఓ ఆయుధ ఒప్పందం విషయంలో చాలా కాలంగా మనదేశం వైపే చూస్తోంది. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టనుండటంతో బైడెన్ ప్రభుత్వం ఈ డీల్‌ను ఓకే చేయించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే డ్రోన్ అమ్మకాలపై అమెరికా నుంచి ప్రతిపాదన వచ్చినా.. మనదేశం ఆచితూచి స్పందించింది. 2 నుంచి 3 బిలియన్ డాలర్ల విలువ చేసే డ్రోన్ల ఒప్పందానికి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమెరికాకు పెద్ద స్థాయిలోనే గిట్టుబాటు కాబోతోంది.
అమెరికా దగ్గర ఉన్న డ్రోన్లు ఏంటి ? భారత్ ఎందుకు కొనాలి ?
యుద్ధం రూపురేఖలు మారిపోతున్నాయి. భారీ యుద్ధ ట్యాంకులు, అతిపెద్ద యుద్ధ విమానాల స్థానంలోకి డ్రోన్లు వచ్చి చేరుతున్నాయి. ప్రత్యర్థి దేశాలపై దాడులు చేయడంలో డ్రోన్లు కీలకంగా మారాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డ్రోన్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు పుతిన్ టార్గెట్‌గా ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి పాల్పడింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్ని దేశాలు తమ ఆయుధ సంపత్తిలో డ్రోన్లను భాగస్వామ్యం చేస్తున్నాయి. పాక్, చైనాల నుంచి నిత్యం ముప్పు ఎదుర్కొనే భారత్ అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే భారత్ -అమెరికా డ్రోన్ డీల్. సముద్రంపై విహరిస్తూ శత్రుదేశాల భరతం పట్టే సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయబోతోంది.
సీ గార్డియన్ డ్రోన్ల ప్రత్యేకత ఏంటి?
రక్షణ అవసరాల కోసం అన్ని దేశాలు డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయాలనుకుంటున్న డ్రోన్ అత్యాధునికమైంది. దీని పేరు MQ 9B సీ గార్డియన్ డ్రోన్. అమెరికాకు చెందిన ఎనర్జీ అండ్ డిఫెన్స్ కార్పొరేషన్ కంపెనీ ఈ సీ గార్డియన్ డ్రోన్లను తయారు చేస్తోంది. ఎలాంటి ప్రతికూలమైన వాతావరణంలోనైనా ఏకధాటిగా 30 గంటల పాటు ఇవి ఎగరగలవు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా సముద్రంపై ఎగురుతూ రియల్ టైమ్‌లో సమాచారాన్ని పంపించగలవు. వీటిలో మారిటైమ్ రాడార్, ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ లాంటి అధునాతన సదుపాయాలు ఉంటాయి. భారత మిలిటరీ దగ్గర ఇవి ఉంటే వీటితో ఎన్నో రకాల ఆపరేషన్స్ నిర్వహించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనషులు వెంటనే చేరుకోలేని ప్రాంతాలకు ఇవి వెళ్లగలవు. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌లలో వాయువేగంతో పాల్గొనగలవు. ప్రత్యర్థి దేశాలపై నిఘా పెట్టేందుకు, అవసరమైతే ఏకధాటిగా దాడులు చేసేందుకు కూడా ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇంటిలిజెన్స్ సమాచారాన్ని సేకరించే ఆపరేషన్‌లో భాగంగా ప్రస్తుతం MQ 9B సీ గార్డియన్ డ్రోన్‌లను రక్షణశాఖ లీజుకు తెచ్చుకుంది. వీటి ఉపయోగం ఏంటో గుర్తించిన భారత ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇప్పటికే ఈ డ్రోన్లను ఉపయోగిస్తుండగా ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ ఎయిర్‌ఫోర్స్, బెల్జియం సైన్యం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
భారత్ వీటిని కొనుగోలు చేస్తే ఏంటి ఉపయోగం ?
చైనా, పాకిస్థాన్.. ఈ రెండు దేశాలు మనకు ఎప్పుడూ పక్కలో బల్లెంలానే ఉంటాయి. ఈ రెండు దేశాలతో మనకు ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఊహించలేం. ఇప్పటికే చైనా ఇదే తరహా డ్రోన్లను డిజైన్ చేసి పాకిస్థాన్‌కు తరలించింది. పాకిస్థాన్ మిలిటరీ దగ్గర ఉన్న డ్రోన్లు.. గంటకు 370 కి.మీ వేగంతో నాన్‌స్టాప్‌గా 20 గంటలు ట్రావెల్ చేయగలవు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఈ రెండు దేశాల డ్రోన్ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే MQ 9B సీ గార్డియన్ డ్రోన్లతో సాధ్యమవుతుందని భారత రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సీ గార్డియన్ డ్రోన్లను, స్కై గార్డియన్ డ్రోన్లగా కూడా ఉపయోగించవచ్చు. 360 డిగ్రీల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగల ఈ డ్రోన్లు అవసరమైతే పేలుడు పదార్ధాలు కూడా మోసుకెళ్లగలవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను అనుసరించి ఈ డ్రోన్లు పనిచేస్తాయి.
ఇంతకాలం భారత్ వీటిని ఎందుకు కొనలేదు..?
ఈ డ్రోన్ల శక్తిసామర్ధ్యాలు భారత రక్షణరంగ నిపుణులకు తెలుసు. అయినా సరే వీటిని కొనుగోలు చేసే విషయంలో మొదటి నుంచి సానుకూలత వ్యక్తం చేయలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది భారీ బడ్జెట్. MQ 9B సీ గార్డియన్ డ్రోన్లను 18-30 వరకు కొనుగోలు చేయాలంటే 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. రెండోది ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా భారత్ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ ఉత్పత్తులను తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. ఇలాంటి సమయంలో MQ 9B సీ గార్డియన్ వంటి డ్రోన్లను దేశీయం తయారు చేయడానికి ఉన్న అవకాశాల కోసం ప్రయత్నాలు జరిగాయి. కనీసం ఈ డ్రోన్ల విడిభాగాలైనా ఇండియాలో తయారు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ డీల్ ఓకే చేయించుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా.. ఈ కారణాల వల్ల భారత ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చైనా కూడా ఈ మధ్య కాలంలో తోకజాడించడం మొదలు పెట్టింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ డీల్‌పై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి.